- వచ్చే ఏడాది నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచన
- డీఎస్‌హెచ్ పరిధిలోని దవాఖానలపై మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 90 శాతం మంది రోగులకు సొంత జిల్లాల్లోనే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రుల భవన నిర్మాణ పనులపై సోమవారం జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలో ఇప్పటికే 9 ఆస్పత్రుల భవనాల నిర్మాణం పూర్తయిందని, డిసెంబర్ నాటికి మరో 14, మార్చి నాటికి ఇంకో 11 భవనాలు పూర్తి కానున్నాయని మంత్రికి టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ వివరించారు. ఇవి కాకుండా మరో 45 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి..
నిర్మాణం పూర్తయిన 9 భవనాల్లో అవసరమైన పరికరాలు (ఎక్విప్‌మెంట్), ఫర్నీచర్ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. డిసెంబర్, మార్చి నాటికి సిద్ధమయ్యే భవనాలకు సంబంధించి పరికరాల కొనుగోలు ప్రక్రియను ఇప్పుడే మొదలుపెట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న మిగతా అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే పూర్తి బాధ్యత డీసీహెచ్‌ఎస్‌లు సూపరింటెండెంట్లపైనే ఉందని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో తాగునీరు, విద్యుత్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చొంగ్తు, వివిధ జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు పాల్గొన్నారు.
